‘డబుల్’​ ఇండ్ల పంపిణీకి ప్లాన్...వసతుల కల్పనకు ఫండ్స్​ మంజూరు

  • మధ్యలో ఆగిన పనుల పూర్తికి  చర్యలు   ​ 

మెదక్​, వెలుగు: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.  ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు లబ్దిదారుల సర్వే కొనసాగుతోంది.  అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను కూడా అర్హులైన వారికి  పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇండ్ల నిర్మాణం పూర్తయిన కాలనీల్లో  మౌలిక వసతులు కల్పించి  పంపిణీ చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను అదేశించింది.

మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను విడుదల చేసింది. మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో  బీఆర్ఎస్​  హయాంలో 4,776  డబుల్ బెడ్​ రూమ్​ ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో  2,759 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది.  మెదక్​, పాపన్నపేట,  హవేలి ఘనపూర్,  వెల్దుర్తి మండలాల్లో పూర్తయిన  దాదాపు వెయ్యి డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను పేదలకు పంచారు.  మరో వెయ్యి ఇండ్ల నిర్మాణం  పూర్తయినా వసతులు కల్పించకపోవడంతో వాటిని పంపిణీ చేయలేదు. ఈ ఇండ్లలో మిగిలిపోయిన పనులు   చిన్నపాటి పనులు పూర్తి చేసేందుకు  కాంగ్రెస్​ ప్రభుత్వం సిద్ధమైంది.

ప్రభుత్వం నిధులు ఇవ్వడంతో పంచాయతీ రాజ్​ శాఖ అధికారులు పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు.  మెదక్​ పట్టణం, నిజాంపేట మండలం చెల్మెడ, కల్వకుంట,  చేగుంట మండలం  కొండాపూర్​లో పూర్తయిన 350 ఇండ్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇంకా వివిధ చోట్ల అసంపూర్తిగా ఉన్న  500 ఇండ్ల పనులను కూడా పూర్తి చేసేందుకు నిధులు  మంజూరు అయ్యాయి.   మెదక్​ పట్టణంలోని  పిల్లి కొటాల్​ లో దాదాపు 900 డబుల్ బెడ్​ రూమ్​ ఇండ్ల నిర్మాణం చేపట్టగా..  దాదాపు 500 ఇండ్లను పేదలకు పంపిణీ చేశారు.

మిగితా వాటిలో వివిధ దశల్లో ఉన్న  100 ఇండ్ల పనులు కంప్లీట్​ చేసి పంపిణీకి రెడీ చేశారు. నర్సాపూర్​లో  500 డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు మంజూరు కాగా,  254 ఇండ్ల నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయలేదు. మరో 246 డబుల్ బెడ్​ రూమ్​ ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉండగా వాటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇటీవల రూ.1.02 కోట్లు మంజూరు చేసింది.   డబుల్ బెడ్​ రూమ్​ ఇండ్లకు గతంలో దరఖాస్తు చేసుకున్నవారి లిస్ట్​లను వడబోసి అర్హులైన వారికి  కేటాయించనున్నారు.